
ఇరాన్తో శాంతి చర్చల నిమిత్తం వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల పాక్ పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని, అనవసరంగా సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పడంతో మళ్లీ యుద్ధం తప్పేలా లేదనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం.. అమెరికా రాయబారులు బయలుదేరడానికి సిద్ధమవుతున సమయంలో.. “18 గంటల విమాన ప్రయాణం” చేయవద్దని ట్రంప్ వాళ్లకు చెప్పారు.
అమెరికా ప్రతినిధులు “ఏమీ మాట్లాడకుండా ఖాళీగా కూర్చోవడం” తనకు ఇష్టం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని.. ఇరాన్ కోరుకున్నప్పుడు ఎప్పుడైనా తమని పిలవవచ్చని చెప్పారు. అయితే.. ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేయడం వల్ల ఇరాన్‌లో యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందని అర్థం కాదని ట్రంప్ వివరణ ఇచ్చారు. ఈ పర్యటన రద్దు వల్ల యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు.. ఆయన బదులిస్తూ.. “కాదు. దాని అర్థం అది కాదు. మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు” అని అన్నారు.