Reading Time: 2 minutes

T20 World Cup 2026: వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ దూరం.. రీప్లేస్ మెంట్‌గా ఆ జట్టుకు ఛాన్స్

Caption of Image.

టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇండియాలో ఆడుతుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న 2026 టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది. భద్రతా కారణాలు చూపిస్తూ ఇండియాలో వరల్డ్ కప్ ఆడడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. ఐసీసీ పలుమార్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆలోచించుకోమని అవకాశమిచ్చినా ఆ దేశ క్రికెట్ బోర్డు మాత్రం ఇండియాలో ఆడేది లేదని గురువారం (జనవరి 22) అధికారికంగా ధృవీకరించింది. 

బంగ్లాకు రీప్లేస్ గా స్కాట్లాండ్: 

దీంతో మెగా టోర్నీలో బంగ్లా ఆడుతుందా.. లేదా..? అని గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. టోర్నీ నుంచి బంగ్లా వైదొలగడంతో ఆ జట్టు స్థానంలో మరో టీమ్‎ను ఐసీసీ భర్తీ చేయనుంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రావడం దాదాపు ఖరారైంది. స్కాట్లాండ్ జట్టు టీ20వరల్డ్ కప్ కు అర్హత సాధించడానికి ప్రధాన కారణం వారి ఐసీసీ ర్యాంకింగ్. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ తృటిలో టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. బంగ్లాదేశ్ స్థానంలో ఏ జట్టును నియమించాలనే దానిపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. స్కాట్లాండ్ తమదైన రోజున పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.   

అసలేం జరిగిందంటే..?

ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. దీంతో వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తాము ఆడబోయే మ్యాచ్ లను ఇండియా బయట తటస్థ వేదికలకు తరలించాలని బ్లంగా క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. లేదంటే తమ జట్టును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మార్చాలని మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే.. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో బీసీబీ అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలో ఆడాల్సిందేనని.. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇండియాలో ఆడేందుకు ఇష్టపడని బంగ్లాదేశ్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం (జనవరి 22) ప్రకటించింది.
     
ఇండియాలో నాలుగు లీగ్ మ్యాచ్ లు:

భారత్‌, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‎తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ షెడ్యూల్ ను స్కాట్లాండ్ రీప్లేస్ చేయనుంది. 

►ALSO READ | Rohit Sharma: రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడం భారత యాజమాన్యానికి ఇష్టం లేదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

©️ VIL Media Pvt Ltd.