Reading Time: 2 minutes
India Gdp Growth 7 8 In Q1 Fy2026 27 Pm Modi Hails Economic Growth

PM Modi: భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) దేశ వాస్తవ జీడీపీ 7.8% వృద్ధి చెందింది. ఈ వృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత ప్రజల సమష్టి శక్తికి, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

పీఎం మోదీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. కొవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం దెబ్బతిన్నప్పటికీ భారత్‌ తన పురోగతిని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

దేశంలో కొందరు నిరాశావాదంతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో నిరుత్సాహాన్ని వ్యాప్తి చే2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంస్తున్నారని ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ భారత్‌ 7.8% వృద్ధిని సాధించిందని అన్నారు. ఇదే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’కు ప్రాధాన్యం..

దేశీయ ఉత్పత్తులు, స్థానిక వినియోగానికి ప్రజలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు. ‘స్వదేశీ’, ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ స్ఫూర్తిని ప్రజలు పాటించాలని అన్నారు. విదేశాలకు విహారయాత్రలకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే వెళ్లవద్దని, వివాహాలను కూడా విదేశాల్లో కాకుండా భారత్‌లోనే నిర్వహించేలా ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరం లేనప్పుడు బంగారం కొనుగోలు చేయడాన్ని కూడా తగ్గించాలని అన్నారు.

స్వదేశీ, ఆత్మనిర్భరతకు ఎంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే అంత బలమైన భారత్‌ను నిర్మించగలమని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి యువతకు అభివృద్ధి చెందిన భారత్‌ను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రూ.81.36 లక్షల కోట్లకు వాస్తవ జీడీపీ..

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.81.36 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఇదే త్రైమాసికంలో ఇది రూ.75.46 లక్షల కోట్లుగా ఉంది. దీంతో ఏడాది ప్రాతిపదికన 7.8% వృద్ధి నమోదైంది. ఈ వృద్ధి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గతంలో అంచనా వేసిన 7% కంటే ఎక్కువగా ఉండటం విశేషం. పూర్తి 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 6.6% నుంచి 6.7%కి సవరించింది.

ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించే నామమాత్ర జీడీపీ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.88.27 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.80 లక్షల కోట్లుగా ఉండగా.. ఈసారి 10.3 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో వాస్తవ స్థూల విలువ జోడింపు (GVA) రూ.73.82 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.68.21 లక్షల కోట్లుగా ఉన్న వాస్తవ GVA ఈసారి 8.2 శాతం వృద్ధి చెందింది.