Reading Time: 2 minutes
Phonepe Upi 123pay Feature Phones Get Upi Payments Without Internet

PhonePe UPI 123Pay: స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా డిజిటల్‌ పేమెంట్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ ఫోన్ పే (PhonePe) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫీచర్‌ ఫోన్లలోనూ UPI లావాదేవీలు నిర్వహించుకునేలా UPI 123Pay సేవలను విస్తరించింది. దీంతో సాధారణ ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు కూడా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండా డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇంటర్నెట్‌ లేకుండానే UPI పేమెంట్స్‌..

ఫోన్ పే UPI 123Pay సేవ SMS ఆధారంగా పనిచేస్తుంది. దీనికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం ఉండదు. పరిమిత 2G నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ సేవను ఉపయోగించుకునేలా రూపొందించారు. దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు UPI సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఫోన్ పే ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా UPI 123Pay ద్వారా ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు ఇతర వ్యక్తులకు డబ్బులు పంపించడంతో పాటు వ్యాపార సంస్థలకు చెల్లింపులు చేయవచ్చు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం, గత లావాదేవీల వివరాలు తెలుసుకోవడం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. భవిష్యత్‌ అప్‌డేట్స్‌లో బిల్‌ పేమెంట్స్‌, మొబైల్‌ రీచార్జ్‌లు, ఆధార్‌ ఆధారిత UPI రిజిస్ట్రేషన్‌ వంటి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?

UPI 123Payకు సపోర్ట్‌ చేసే ఫీచర్‌ ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన ఫోన్ పే యాప్‌ ద్వారా సేవను సెటప్‌ చేసుకోవచ్చు. ముందుగా నిబంధనలు, షరతులకు అంగీకరించి బ్యాంకును ఎంచుకోవాలి. అనంతరం డెబిట్‌ కార్డు చివరి ఆరు అంకెలు, కార్డు గడువు తేదీని నమోదు చేసి UPI పిన్ సెట్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత కాంటాక్ట్‌, మొబైల్‌ నంబర్‌ లేదా UPI ID ద్వారా డబ్బులు పంపించవచ్చు. కెమెరా ఉన్న ఫీచర్‌ ఫోన్లలో QR కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. పేమెంట్‌ చేసే ముందు గ్రహీత వివరాలను ధృవీకరించి, మొత్తాన్ని నమోదు చేసి UPI పిన్ ఎంటర్‌ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది.

AI వాయిస్‌ హెల్ప్‌లైన్‌..

సేవను సులభంగా ఉపయోగించుకునేందుకు ఫోన్ పే AI ఆధారిత వాయిస్‌ హెల్ప్‌లైన్‌ను కూడా అందిస్తోంది. ఇది ఇంగ్లిష్‌తో పాటు 12 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. యూజర్లకు దశలవారీగా యాక్టివేషన్‌ ప్రక్రియను వివరించడంతో పాటు ప్రాథమిక UPI సందేహాలకు సమాధానాలు అందిస్తుంది. ప్రస్తుతం HMD, నోకియా, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ సంస్థలకు చెందిన ఎంపిక చేసిన ఫీచర్‌ ఫోన్లలో ఈ సేవ అందుబాటులో ఉంది. HMD ప్రకారం HMD 105 2G, HMD 110 2G, Nokia 105 Classic, Nokia 105 Single SIM, Nokia 105 Dual SIM, Nokia 106, Nokia 123 Shield మోడళ్లలో ఈ సదుపాయం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని HMD, నోకియా మోడళ్లకు కూడా సపోర్ట్‌ అందించనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ఫీచర్‌ ఫోన్లలో మాత్రమే UPI 123Pay సేవ అందుబాటులో ఉండగా.. రానున్న నెలల్లో మరిన్ని మోడళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.