
నల్గొండ, వెలుగు: నకిరేకల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌ను సెప్టెంబరు 5న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్‌తోపాటు పరిసర ఆరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి. నకిరేకల్‌పట్టణంలో పాత జాతీయ రహదారి పక్కన 1990 కంటే ముందు 30 బెడ్స్‌తో పీహెచ్‌సీ ఉండేది. దానిని 1998లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మార్చారు. ఓపీ సంఖ్య రోజుకు 350 నుంచి 500 వరకు నమోదవుతుండడంతో 2022లో 100 బెడ్స్‌కు అప్‌గ్రేడ్ చేశారు.
జాతీయ రహదారి వెంట రూ.32 కోట్లతో బిల్డింగ్ నిర్మించారు. ఈ పనులు ఐదు నెలల కింద పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది. కొత్త ఆసుపత్రి ప్రారంభమై పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.