Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Hailed By Sachin Gayle Sehwag And Yuvraj After Ipl 2026 Heroics

Vaibhav Sooryavanshi Hailed by Sachin: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ప్రపంచ స్థాయి బౌలర్లపై విరుచుకుపడుతున్న బుడ్డోడు.. ఇప్పటికే కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతడి బ్యాటింగ్ చూసి అభిమానులు మాత్రమే కాదు.. క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అవుతున్నారు. భారత మాజీ క్రికెటర్లు వైభవ్ టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. అతడిని భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.

మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ అతి పెద్ద స్టార్‌గా మారతాడు’ అని చెప్పాడు. అతడి దూకుడు, పవర్ హిట్టింగ్ చూస్తుంటే ప్రపంచ క్రికెట్‌పై చాలా కాలం ఆధిపత్యం చెలాయించే సామర్థ్యం కనిపిస్తోందని రాయుడు అభిప్రాయపడ్డాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా వైభవ్ ఆటకు మంత్ర ముగ్ధుడయ్యాడు. ‘నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ టాలెంట్స్‌లో వైభవ్ ఒకడు’ అని ప్రశంసించాడు. గేల్ లాంటి విధ్వంసక బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం చిన్న విషయం కాదు.

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్‌ను ‘జీనియస్ ప్లేయర్’గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని దూకుడుగా ఆడటం అసాధారణమని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘వైభవ్ బ్యాట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుంది. ఇలాంటి బ్యాట్ స్పీడ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని అనడం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మాటలు వైభవ్ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో చూపిస్తున్నాయి.

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వైభవ్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ‘వైభవ్ సూర్యవంశీ అన్‌బిలీవబుల్ ప్లేయర్. ఇలాంటి ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు’ అని పేర్కొన్నాడు. దూకుడైన బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా పేరున్న సెహ్వాగ్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే వైభవ్‌ను ‘వండర్ కిడ్’గా అభివర్ణించాడు. చిన్న వయసులోనే ఇంత మెచ్యూరిటీతో ఆడటం అరుదైన విషయం అని చెప్పాడు.

వైభవ్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ‘వైభవ్ సాధారణ ఆటగాడు కాదు.. అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ప్లేయర్’ అని కొనియాడాడు. యువీ లాంటి మ్యాచ్ విన్నర్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు వైభవ్ భవిష్యత్తుపై అంచనాలను మరింత పెంచేశాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ బుడ్డోడు.. త్వరలోనే భారత జట్టుకు కూడా ఎంపిక కావడం ఖాయమనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో కొత్త సూపర్ స్టార్ పుట్టాడని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.