Reading Time: 2 minutes
Healthy Beetroot Buttermilk Recipe Refreshing Summer Drink For Glowing Skin

Beetroot Buttermilk Recipe: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం ప్రతి ఒక్కరూ వెతుకుతుంటారు. ఈ సమయంలో చాలామంది మజ్జిగను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే సాధారణ మజ్జిగకు బదులుగా కొంచెం ప్రత్యేకంగా, మరింత ఆరోగ్యకరంగా ఉండే బీట్‌రూట్ మజ్జిగను ట్రై చేస్తే రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. బీట్‌రూట్ మజ్జిగ లేదా చుకందర్ ఛాస్‌ కేవలం శరీరాన్ని చల్లబరచడమే కాదు, చర్మానికి సహజ కాంతిని తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది. వేసవి వేడిలో బయటకు వెళ్లడం వల్ల చర్మం నిస్సత్తువగా మారుతుంది. అలాంటి సమయంలో ఈ ప్రత్యేక మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి ముఖానికి తేజస్సును అందిస్తుంది.

సాధారణంగా మజ్జిగ తెల్లగా ఉంటుంది. కానీ బీట్‌రూట్ కలపడం వల్ల ఈ మజ్జిగ అందమైన గులాబీ రంగులో కనిపిస్తుంది. ఈ ఆకర్షణీయమైన రంగు కారణంగా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తాగుతారు. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా భిన్నంగా, రిఫ్రెష్‌గా ఉంటుంది. బీట్‌రూట్‌లో ఐరన్‌, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మరోవైపు పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. ఈ రెండింటి కలయికతో తయారయ్యే బీట్‌రూట్ మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కావలసిన పదార్థాలు
* 1 చిన్న ఉడికించిన బీట్‌రూట్‌ (ముక్కలు చేసినది)
* 2 కప్పుల పెరుగు
* 10 నుంచి 12 పుదీనా ఆకులు
* చిన్న అల్లం ముక్క
* కొద్దిగా కొత్తిమీర
* 1.5 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి
* 1 టీస్పూన్ నల్ల ఉప్పు
* తగినంత ఉప్పు
* అర కప్పు నీరు
* కొన్ని ఐస్ క్యూబ్స్

బీట్‌రూట్ మజ్జిగ తయారీ విధానం
ముందుగా ఉడికించిన బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత మిక్సీ జార్‌లో బీట్‌రూట్ ముక్కలు, అల్లం, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేయాలి. మీకు కారం ఎక్కువగా ఇష్టమైతే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మరొకసారి బ్లెండ్ చేస్తే మెత్తని ప్యూరీ సిద్ధమవుతుంది. తర్వాత పెరుగు వేసి మళ్లీ బాగా కలపాలి. మజ్జిగ మరింత పలుచగా కావాలనుకుంటే కొద్దిగా నీరు కలిపి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇలా తయారైన బీట్‌రూట్ మజ్జిగను గ్లాస్‌లో పోసి పైన కొద్దిగా జీలకర్ర పొడి లేదా పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి. ఈ వేసవిలో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుకోవాలంటే బీట్‌రూట్ మజ్జిగను తప్పకుండా ట్రై చేయండి.