
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అడ్డుపెట్టుకుని వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. గ్యాస్ ధరలు, ఇంధన వ్యయం పేరుతో మెనూ కార్డులో ఉన్న ధరల కంటే అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు అదనపు ఛార్జీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో సీసీపీఏ ఈ హెచ్చరికలు జారీ చేసింది. హోటల్ మెనూలో పేర్కొన్న ధరలే తుది ధరలని, వాటికి మించి సర్వీస్ ఛార్జీలు లేదా ఇతర అదనపు రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వినియోగదారుల రక్షణ చట్టం-2019 మార్గదర్శకాలను అతిక్రమించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్యాస్ కొరత సాకుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని సీసీపీఏ పేర్కొంది. ఒకవేళ ఏవైనా హోటళ్లు లేదా రెస్టారెంట్లు బలవంతంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే, వెంటనే వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. హోటల్ యజమానులు కేవలం ఆహార పదార్థాల ధరలనే వసూలు చేయాలని, అనవసరపు వడ్డనలతో కస్టమర్లను వేధించవద్దని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: