Reading Time: 2 minutes
Video: ఇదెక్కడి రనౌట్ మావా.. ఆ ఒక్క తప్పిదం మ్యాచ్‌నే తారుమారు చేసిందిగా..!

PSL 2026 Run Out Video: లాహోర్ గడ్డాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్ వర్సెస్ కొత్త జట్టు హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టుకు ఫకర్ జమాన్, మహమ్మద్ నయీమ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే, తొమ్మిదో ఓవర్‌లో నయీమ్ ఔట్ అయిన తర్వాత అసలు డ్రామా మొదలైంది. మార్నస్ లబుషేన్ వేసిన బంతి ఫకర్ ప్యాడ్‌కు తగిలి పాయింట్ దిశగా వెళ్ళింది. పరుగు కోసం ఫకర్ ముందుకు రాగా అవతలి ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ కూడా స్పందించాడు. కానీ ఫకర్ మధ్యలోనే ఆగిపోవడంతో షఫీక్ క్రీజుకు దూరంగా నిలబడిపోయాడు. హమ్మద్ ఆజం విసిరిన త్రోను వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ అందుకుని బెయిల్స్ ఎగరగొట్టాడు. ఈ రనౌట్ సమయంలో షఫీక్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడగా ఫకర్ మౌనంగా ఉండిపోయాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఫకర్ జమాన్ కూడా 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. 84 పరుగులకు వికెట్ కోల్పోని లాహోర్ జట్టు కేవలం 10 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి 94-3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇంజమామ్ ఉల్ హక్ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి వింత రనౌట్ల కారణంగా పెవిలియన్ చేరిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తిరిగి పుంజుకున్న లాహోర్ ఖలందర్స్..

మిడిల్ ఓవర్లలో తడబడినప్పటికీ లాహోర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ హసీబుల్లా ఖాన్ (40 పరుగులు), సికందర్ రజా (45 పరుగులు) ధాటిగా ఆడారు. చివరలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది వరుస సిక్సర్లతో విరుచుకుపడటంతో హైదరాబాద్ కింగ్స్ మెన్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..