Reading Time: 2 minutes
Manav Suthar Creates History On Test Debut Becomes First Indian To Achieve Rare Feat

Manav Suthar Creates History: భారత యువ ఆల్‌రౌండర్ మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సుతార్, ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంతితో వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాట్‌తో విలువైన పరుగులు చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఇది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయానికి మనవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు.

ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో సుతార్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశాడు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ అరంగేట్రంలోనే ఆరు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌లోనూ సుతార్ తన ప్రతిభను నిరూపించాడు. భారత్ తన ఏకైక ఇన్నింగ్స్‌లో 564/8 డిక్లేర్ స్కోరు నమోదు చేసిన సమయంలో, సుతార్ 41 బంతుల్లో 28 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మూడు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.

ఈ ప్రదర్శనతో మనవ్ సుతార్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అరంగేట్ర టెస్టులో 25 కంటే ఎక్కువ పరుగులు చేయడం, ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం, మూడు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టడం అనే అరుదైన త్రివిధ ఘనతను సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు ఈ ఘనతను కేవలం ముగ్గురు మాత్రమే సాధించారు. 1895లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్బర్ట్ ట్రాట్, 1922లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ కెన్నెడీ, 1977లో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జోయెల్ గార్నర్ ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు 49 సంవత్సరాల పాటు ఎవరూ ఈ ఘనతను అందుకోలేకపోయారు. ఇప్పుడు 1824వ టెస్ట్ మ్యాచ్‌లో మనవ్ సుతార్ ఈ అరుదైన రికార్డును తిరిగి నమోదు చేశాడు.

ఇదే కాకుండా, తన అరంగేట్ర టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న తొమ్మిదో భారత ఆటగాడిగా కూడా సుతార్ నిలిచాడు. గతంలో ప్రవీణ్ ఆమ్రే, ఆర్‌పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి భారత క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన మనవ్ సుతార్, భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ స్టార్‌గా అవతరించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి అద్భుత ప్రదర్శన ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.