
పశ్చిమాసియా రణరంగంగా మారింది. ప్రపంచమంతా పెట్రోల్ ధరల మంటలు.. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు.. వీటన్నింటి నడుమ హార్మూజ్‌ను తెరవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. గడువు ముగిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో అని ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూసింది. ఈ సమయంలోనే ట్రంప్ ‘ఓ నాగరికత అంతమవుతోంది’ అని విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఏమాత్రం తొణకని ఇరాన్.. సంధికి మాత్రం ససేమిరా అంటూ కూర్చుంది.. దీంతో భీకరదాడులు తప్పవనే ఉత్కంఠ పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్లిపోయింది.డెడ్‌లైన్ ముగిసేది రాత్రి ఎనిమిది గంటలకు.. ఆ తర్వాత వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు టార్గెట్ లిస్ట్ సిద్ధమైంది. టెహ్రాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని.. జరగబోయే విధ్వంసానికి ఇది నిదర్శనమంటూ ట్రంప్ చేసిన ప్రచారం, ఖార్గ్ ద్వీపంపై దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
యుద్ధంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేని ఇరాన్.. ఈ బెదిరింపులను మరింత సీరియస్‌గా తీసుకుంది. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలన్నీ యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చనే సంకేతాలను ఇచ్చాయి. ఈ సమయంలో ట్రంప్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డెడ్‌లైన్‌కు కేవలం 90 నిముషాల ముందు సాయంత్రం పోస్టు పెట్టారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పది పాయింట్ల ప్రతిపాదనలు, చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. చివరి క్షణాల్లో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై భారీ బాంబుదాడుల హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిందా? దాని షరతులు ఏమిటి? దీర్ఘకాలిక శాంతికి దారి తీస్తుందా? అనే అంశాలపై స్పష్టత లేదు. పక్షాలు ఒప్పంద నిబంధనలను భిన్నంగా వివరిస్తున్నాయి.
ఒప్పందం ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు ఇరాన్ నుంచి క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం రావడంతో పాటు, కువైట్ సైన్యం డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్‌లోని ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. ఒప్పందంపై చర్చలు త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, కీలక అంశాలు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఫీజులు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన షరతులు ఇంకా వెల్లడి కాలేదు. ఇతర దేశాలు దీనికి అంగీకరించాయా, లేదా అన్నదీ తెలియరాలేదు. ఇదే సమయంలో లెబనాన్‌లోని పోరాటాలను ఈ ఒప్పందం నిలిపివేస్తుందని పాకిస్తాన్ పేర్కొనగా, ఇజ్రాయెల్ మాత్రం అంగీకరించలేదు. టెహ్రాన్ వీధుల్లో ప్రభుత్వం అనుకూలంగా నిరసనకారులు అమెరికా మృతి, ఇజ్రాయెల్ మృతి అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలు తీవ్రవాద వర్గాల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒప్పందం కుదరకపోతే ఒక నాగరికత అంతరించిపోతుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాల్పుల విరమణ షరతులపై విభిన్న వాదనలు
ట్రంప్ చెప్పిన ప్రకారం, ఇరాన్ 10 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఫార్సీ భాషలో బయటకు వచ్చిన ఈ పత్రంలో ఇరాన్ యురేనియం శుద్ధిని కొనసాగిస్తుందని పేర్కొనడంతో, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో అమెరికా యుద్ధనౌకలు కొనసాగుతాయని కూడా ఆయన సూచించారు. ఇరాన్ మాత్రం యుద్ధం ముగియాలంటే అమెరికా, తమ సైన్యాన్ని ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవి అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత శాంతి చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని మద్దతు ఇచ్చినా, లెబనాన్‌లోని హెజ్‌బుల్లా పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హార్మూజ్ జలసంధిలో వసూళ్లకు అవకాశం
యుద్ధంలో సాంకేతికంగా ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్‌కు వ్యూహాత్మకంగా లాభించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం నియంత్రణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. ఒప్పందం ప్రకారం, ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ నావిగేషన్ సంప్రదాయాలకు విరుద్ధమని గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అణు, క్షిపణి కార్యక్రమాలపై స్పష్టత లేదు
యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసినప్పటికీ, అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమని చెబుతున్నప్పటికీ, అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ ప్రకారం ఈ ముప్పులను తొలగించడమే యుద్ధానికి ప్రధాన కారణం. ఇజ్రాయెల్ అధికారులు, అమెరికా ఈ ఒప్పందాన్ని ముందుగానే సమన్వయం చేసిందని, ఇరాన్ మౌలిక వసతులపై దాడులు ఈ ఒప్పందానికి దోహదం చేశాయని పేర్కొన్నారు.
ఒప్పందం తర్వాత కూడా దాడులు
ఒప్పంద ప్రకటన తర్వాత కూడా పలు దేశాల్లో క్షిపణి హెచ్చరికలు జారీ అయ్యాయి. అబుదాబిలో గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కువైట్, యుఏఇ దేశాలు డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. ఇరాన్‌లోని లావన్ దీవిలో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, లెబనాన్‌లో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కూడా పలువురు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.