Reading Time: < 1 minute
Ram Charans Peddi Ticket Price Hike In Ap Government Released A Special G O

మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ దగ్గరపడుతున్ననేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేశారు.

 దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి, సినిమా విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక సినిమా  రిలీజ్ రోజు అనగా  జూన్ 4 నుండి జూన్ 10వ తేదీ వరకు (మొదటి వారం రోజుల పాటు) ప్రస్తుతమున్న టికెట్ ధరలపై అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు మేకర్స్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాకు మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ‘పెద్ది’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ సాధించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.