Reading Time: < 1 minute

నడి సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‎పై ఇరాన్ మెరుపు దాడి.. భారతీయుడు మృతి

Caption of Image.

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‎లోని హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్‎పై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో 20 మంది షిప్ సిబ్బంది తీవ్రంగా గాయపడగా.. అందులో ఓ వ్యక్తి చనిపోయాడు. మరణించిన వ్యక్తిని భారతీయుడిగా గుర్తించారు. ఈ విషయాన్ని ఒమన్ అధికారికంగా ధ్రువీకరించింది. 

అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ  క్రమంలో తమ సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారంగా ఇరాన్ దాడుల తీవ్రతను పెంచింది. ఇరాన్ చుట్టుపక్కన ఉన్న అమెరికాకు మద్దతునిచ్చే దేశాలపై మిస్సైళ్ల దాడిని ఉధృతం చేసింది. ఇదే క్రమంలో ఆదివారం (మార్చి 1) ఒమన్ వ్యూహాత్మక జలసంధి హార్మూజ్ లక్ష్యంగా దాడులకు దిగింది.

హార్మూజ్ జలసంధిలో 20 మంది క్రూ మెంబర్లతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‎ను పేల్చేసింది ఇరాన్. ముసాండం గవర్నరేట్లోని ఖసాబ్ పోర్టుకు ఉత్తరాన ఐదు నాటికల్ మైళ్ల దూరంలో పలావు జెండాతో ఉన్న స్కైలైట్ అనే ట్యాంకర్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

IRGC హెచ్చరికలతో జలసంధి మూసివేత:

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరికలతో హార్ముజ్ జలసంధిని మూసివేశారు. టెహ్రాన్ అధికారికంగా పూర్తి దిగ్బంధనను ప్రకటించనప్పటికీ, హార్ముజ్ జలసంధిని దాటడానికి ఏ నౌకకు అనుమతి లేదని హెచ్చరిలు జారీ అయినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది.

హార్మూజ్ .. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‎ను అనుసంధానించే జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే రవాణా జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ (LNG) రవాణా కూడా ఈ జలసంధి నుంచి జరుగుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర చోక్ పాయింట్లలో ఒకటిగా ఆర్మూజ్ జలసంధిని పరిగణిస్తుంటారు.

©️ VIL Media Pvt Ltd.