
హైదరాబాద్: రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిబిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని అన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బిజెపి నిరాహార దీక్షలో రామచందర్ రావు కూర్చున్నారు. ఈ దీక్షలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయలేదని రాహుల్ గాంధీని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రంలోని వర్సిటీల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సూచించారు. విశ్రాంత ఉద్యోగులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ భరోసా ఇచ్చారు.