
టెహ్రాన్: ఇరాన్ లోని ఉత్తర టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి చేసింది. గాంధీ ఆస్పత్రి ధ్వంసం కావడంతో రోగులను మరో ఆస్పత్రికి ఇరాన్ అధికారులు తరలించారు. గాంధీ ఆస్పత్రి దాడిపై డబ్ల్యు హెచ్ఒ డైరెక్టర్ డా. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఆస్పత్రులపై దాడులు ఆందోళనకరమని మండిపడ్డారు. మరో మూడు ఆస్పత్రులపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు సమాచారం. గతంలోనూ టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపైనా ఇజ్రాయిల్ దాడి చేసిన విషయం తెలిసిందే.
సెంట్రల్ టెహ్రాన్ లో శనివారం ఉన్నతాధికారులతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మీటింగ్ పెడుతున్నాడని కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థలు తెలుసుకున్నాయి. ఖమేనీ ఉన్నతాధికారులతో సమావేశం పెట్టుకున్న భవనంపై అమెరికా బాంబుల వర్షం కురుపించడంతో ఖమేనీతో పాటు 50 మంది వరకు మృతి చెందారు. ఖమేనీపై గత కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు గురి పెట్టిన విషయం తెలిసిందే.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ వచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు దాడులకు దిగుతున్నారు. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి. జెరూసలెంలో సైరన్లు మోగుతున్నాయి. ఖమేనీ బాటలోనే వెళ్తామని ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ లోని జెరుసలెంపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ దాడుల్లో 20 మందికి గాయపడడంతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బేత్ పమేష్ పట్టణంపైనా ఇరాన్ దాడి చేయడంతో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆయుధ తయారీ కేంద్రంపై కూడా ఇరాన్ దాడి చేసినట్టు సమాచారం.