Reading Time: < 1 minute
Siddaramaiah Rejects Rajya Sabha Offer Says No Interest In National Politics

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశాక.. దేశ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని… ఈ సందర్భంగా రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లే ప్రసక్తే లేదని.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలనే ఆఫర్ వచ్చినప్పటికీ మర్యాదపూర్వకంగా దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.

“నన్ను రాజ్యసభకు వెళ్లమని అడిగారు. కానీ నేను వెళ్లలేనని వినయంగా చెప్పాను. నాకు రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి ఉంది. ప్రజలు నన్ను ఐదేళ్ల పాటు ఎన్నుకున్నారు. ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నాయి. ఎమ్మెల్యేగా నేను ఇక్కడే ఉంటాను” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

తాను ఎప్పటినుంచో హైకమాండ్ ఆదేశిస్తే రాజీనామా చేస్తానని చెబుతూ వచ్చానని గుర్తుచేశారు. “రెండు రోజుల క్రితం హైకమాండ్ పదవి వీడాలని ఆదేశించింది. అందుకే ఈరోజు రాజీనామా చేశాను. కర్ణాటక ప్రజలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

గురువారం ఉదయం తన నివాసంలో మంత్రివర్గ సహచరులకు ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు డీకే శివకుమార్ తన వారసుడిగా బాధ్యతలు చేపడతారని మంత్రులకు తెలిపారు.