
మొత్తానికి కర్ణాటక కుర్చీ పంచాయితీకి తెరపడింది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. రెండు, మూడు రోజులుగా జాతీయ స్థాయిలో వస్తున్న ఊహాగానాలు ప్రకారమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సిద్ధరామయ్య రాజీనామా లేఖ సమర్పించారు.
ఇక రాజీనామా అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఓటర్లు మా అభిమాన దేవుళ్లు.. హైకమాండ్ రాజీనామా చేయమని చెప్పగానే.. వెంటనే లోక్‌భవన్‌కు సమాచారం ఇచ్చా. కాంగ్రెస్ పార్టీ 136 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం రెండు సార్లు ఇచ్చారు. అధిష్టానానికి ధన్యవాదాలు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని సంక్రమంగా చేస్తారని భావిస్తున్నా.’’ అని సిద్ధరామయ్య తెలిపారు.
‘‘హైకమాండ్ నాకు తెలియజేసినప్పుడల్లా నేను రాజీనామా చేస్తానని చాలాసార్లు చెప్పాను. నిన్న హైకమాండ్ నన్ను రాజీనామా సమర్పించమని కోరింది. నేను ఎల్లుండి.. అంటే ఈరోజే చేస్తానని వారికి చెప్పాను. అందుకే నేను రాజీనామా సమర్పించాను. నేను గవర్నర్ కార్యాలయానికి నా రాజీనామాను సమర్పించాను. గవర్నర్ లోక్‌భవన్‌లో లేరు. ఆయన ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు. అందుకే నేను ఆయన కార్యాలయానికి రాజీనామాను సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.