Reading Time: 3 minutes

ఇండ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం,

రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా

చేయడమే రేవంత్ రెడ్డి పాలన

మూసీ పేరిట సిఎం చేస్తున్న స్కామ్ కోసం

వేలాదిమంది ఇండ్లను కూలకొడుతున్నారు

బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మూసి బాధిత కుటుంబాలతో

కెటిఆర్ మూసి దండి మార్చ్ కార్యక్రమం

మూడున్నర కిలోమీటర్ల

పాదయాత్ర చేసి, వేలాదిమంది ప్రజలు,

మూసి బాధితుల ఆవేదన వింటూ

వారికి భరోసా ఇచ్చిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఒకవైపు దేశంలో బిజెపి బుల్డోజర్ రాజ్యం చేస్తుదంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలంతా చెబుతుంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ రాజ్యాన్ని ఆపకుండా కాంగ్రెస్ మౌనంగా అక్రమ ఉందని విమర్శించారు. ఒకవైపు బుల్డోజర్ రాజ్యం పైన విమర్శలు చేస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న బుల్డోజర్ అరాచకాలను ఆయన పంపిస్తున్న సంచుల కట్టల కోసం చూడకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం రియల్ ఎస్టేట్ దందా చేయడమే అని, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సిఎం ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం కెటిఆర్ హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం కెటిఆర్ నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో బిఆర్‌ఎస్ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరిగి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా.. కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ, బెదిరింపులకు దిగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారు

ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి రూ.200 కోట్లతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికే ఆయనకు ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నదని, అయినా రేవంత్ రెడ్డికి,ఆయన అన్నదమ్ములకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ.. పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు కూడా పోకుండా డిపిఆర్‌ను కూడా సిద్ధం చేశామని గుర్తు చేశారు. కేవలం సుందరీకరణ మాత్రమే కాకుండా రోడ్లతో పాటు ఫ్లై ఓవర్లను కూడా తమ ప్రణాళికలో ఉంచామని, కానీ ఎక్కడా ఒక్క ఇల్లుకు ఇబ్బంది కాకుండా చూశామని అన్నారు. అలాంటి అంశాన్ని పక్కన పెట్టి లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం వేల మంది ఇళ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త స్కామ్‌కి తెరలేపారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నారు

మూసీ బఫర్ జోన్‌కి సంబంధించి రకరకాల మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు అనుమతులు ఇచ్చిందని కెటిఆర్ విమర్శించారు. అప్పుడు అలాంటి అధికారులను, కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏమో జాతీయ స్థాయిలో బిజెపి బుల్డోజర్ రాజ్యం నడిపిస్తుందని విమర్శలు చేస్తారని, స్వయంగా తన సొంత ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాత్రం మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. మూసీలో ఇళ్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తన సొంత మంత్రులు, తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలను, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నారని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి, ఈ బ్రోకర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని కెటిఆర్ పిలుపునిచ్చారు. మూసీ బాధితుల కోసం బిఆర్‌ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ అంశంలో న్యాయ పోరాటంలోనూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని, తమ ఎంఎల్‌ఎలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇండ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.