Reading Time: < 1 minute
Andhra Pradesh Cabinet Approves 56 Agenda Items Including Key Investment Tourism Projects

Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 56 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, పర్యాటకం, ఇంధన ప్రాజెక్టులు, ఉన్నత విద్య, పరిశ్రమలు వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో రూ. 2,387 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

పర్యాటక రంగానికి ఊతం
విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు ఇచ్చింది. ఇక, సౌర, పవన మరియు హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల బలోపేతానికి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించే దిశగా చర్యలు చేపట్టనుంది.

భూకేటాయింపులు, కొత్త శాఖ
వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్.. Kolleru Lake అభయారణ్య సరిహద్దుల ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. మొత్తంగా, పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు మరియు విద్యాభివృద్ధిపై ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.