Reading Time: 2 minutes
Sanju Samson Reacts After Missing Century By 3 Runs In Ind Vs Wi T20 World Cup 2026 Super 8

Sanju Samson React on Missing Century by 3 Runs in IND vs WI: క్రికెట్‌లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్‌కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్‌ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తుంటారు. ఆ కొందరిలో భారత వికెట్‌ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా ఒకడు. టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు 97 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 పరుగులు చేసి.. శతకాన్ని తృటిలో మిస్ అయ్యాడు.

మ్యాచ్‌లో శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికీ.. తనకు ఎలాంటి నిరాశ లేదని సంజు శాంసన్ తెలిపాడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. మీరు 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.. ‘గత టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకాన్ని మిస్ చేసుకున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడాలి అని రోహిత్ భాయ్ మాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. అదే భావనతోనే నేను క్రీజులోకి దిగుతాను. నా ఇన్నింగ్స్ జట్టు విజయానికి తోడ్పడిందంటే అదే నాకు పెద్ద సంతృప్తి’ అని సంజూ చెప్పాడు.

Also Read: Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వ్యక్తిగత రికార్డులపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆధునిక క్రికెట్‌లో జట్టు విజయమే ముఖ్యం అనుకునే ఆటగాళ్లు నిజమైన టీమ్ ప్లేయర్స్ అని ఫాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక సూపర్‌ 8 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. సంజు శాంసన్‌క్రీజులో పాతుకుపోయి మ్యాచ్ చివరి వరకు నిలిచాడు.