Reading Time: 3 minutes
Mohammad Amir Trolled After India Semis Qualification T20 World Cup

Mohammad Amir: నిన్న భారత్‌ vs వెస్టిండీస్ మ్యాచ్‌ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరింది. గతంలో భారత్ సెమీస్‌కు చేరడం అసాధ్యం అని ప్రగల్భాలు పలికిన పాక్ మాజీ ప్లేయర్స్‌కు కర్రు కాల్చి వాత పెట్టనట్లయింది. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సొంత దేశంలోనూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని ఆమిర్ ముందుగానే ప్రకటించాడు. మ్యాచ్‌కు ముందు జియో న్యూస్‌లో ప్రసారమైన ‘హార్నా మానా హై’ కార్యక్రమంలో మాట్లాడిన ఆమిర్, పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుందా లేదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ “పాకిస్థాన్ చేరినా చేరకపోయినా పరవాలేదు, భారత్ మాత్రం చేరదు” అని ధీమాగా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోతుందని అంచనా వేశాడు. తన జోష్యం విఫలమవ్వడంతో వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఆమిర్ చేసిన అంచనాలు తప్పిపోయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అభిమానులు సరదాగా విమర్శలు గుప్పిస్తున్నారు. క్రీడల్లో అంచనాలు సహజం. కానీ మైదానంలో తుది నిర్ణయం ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడుతుంది. సంజూ శామ్సన్ ఆడిన ధైర్యవంతమైన ఇన్నింగ్స్ మరోసారి అదే విషయాన్ని నిరూపించింది. మాటలకన్నా మైదానంలోని ప్రతిభే గొప్పదని భారత్ తన ఆటతో చూపించింది. “ఏమైంది రా సప్పుడు చేస్తలేవ్” అనే ఓ సినిమాలోని డైలాగ్‌తో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

READ MORE: Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

ఇదిలా ఉండగా.. ఉత్కంఠరేపిన సూపర్‌8 పోరులో వెస్టిండీస్‌పై భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (97 నాటౌట్‌, 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగటంతో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో 4 బంతులు ఉండగానే ఛేదించింది. తిలక్‌ వర్మ (27, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (18), హార్దిక్‌ పాండ్య (17) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (40, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ హౌల్డర్‌ (37 నాటౌట్‌, 22 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్స్‌లు), రోవ్‌మాన్‌ పావెల్‌ (34 నాటౌట్‌, 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో చెలరేగిన సంజు శాంసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్ సెమీస్ ఆశలు ఫలించాయి. ఇక సెమీస్‌లో గెలుపుపై మరో ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?