
ఖమేనీ ప్రతీ కదలికపై నిఘా అత్యంత
రహస్య ప్రదేశంలో సమావేశంపై
ఎప్పుడు ఎవరితో
మాట్లాడుతున్నదానిపై ఆరా సరైన
సమయంలో వైమానిక దాడులు
ఇజ్రాయెల్- అమెరికా పక్కా ప్లాన్
తెహరాన్ : ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం. శనివారం నాడు ఇరాన్ లో పనిదినం. పనిదినాలు శనివారంనాడే మొదలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని శనివారం నాడు షంఖానీని, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, అలీ లారిజాని కలుస్తారన్న వార్త అందుకున్న అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ ప్రెసిడెంట్ ట్రంప్, సైనిక ఉన్నతాధికారులకు ఆ విషయం తెలిపింది. అత్యంత రహస్య ప్రదేశంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిసింది. సిఐఏ దాదాపు పది నెలలుగా ఖమేనీ ప్రతికదలికను గమనిస్తోంది. ఎప్పటి కప్పుడు నిఘావర్గాలు ఆ సమాచారాన్ని అందిస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ సీనియర్ సైనిక అధికారుల ఆ సమావేశం సుప్రీంలీడర్ నివాసం ప్రాంగణంలోనే జరుగుతుందని, కచ్చితమైన టైమ్ కూడా తెలియజేసింది. దీంతో అమెరికా – ఇజ్రాయెల్ ఖచ్చితంగా టార్గెట్ పై బాంబులతో విరుచుకుపడ్డాయి.
ఇజ్రాయెల్ – అమెరికా కొద్ది కాలంగా రంజాన్ నెలలోనే ఇరాన్ పై దాడికి ప్లాన్ వేసినా, శనివారం నాడు సమావేశం జరిగే సరైన సమయం పై గూఢచారి వర్గాలనుంచి ఖచ్చిత మైన సమాచారం అందేవరకూ ఎదురు చూశాయి. నిజానికి మొదట్లో శనివారం సాయంత్రం సమావేశం జరపాలని నిర్ణయించినా, ఉదయానికి మారిన విషయాన్ని కూడా ఇజ్రాయెల్ ఇంటిలిజెన్స్ పసికట్టింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రణాళికను కూడా మార్చాయి. అత్యంత భద్రతతో కూడిన ఖమేనీ నివాస ప్రాంగణంలోనే సమావేశం జరుగుతుందని తెలిసినా, సమావేశం జరిగే నిర్దిష్టమైన హాలు విషయంలో అనుమానాలే. శాటిలైట్ దృశ్యాలలో కన్పించిన, మొత్తం ఖమేని నివాస ప్రాంగణం లో అంగుళం కూడా విడవకుండా శనివారం పట్టపగలు బాంబుదాడుల పరంపర కొనసాగింది. ఒక సమాచారం మేరకు అత్యంత శక్తివంతమైన 21 బాంబులు వర్షంలా కురిశాయని తెలిసింది. ఒక పక్క ట్రంప్ ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై రెచ్చగొట్టే ప్రకటనలు .చేస్తుండగా, మరో పక్క ఇరాన్ నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లుతున్నది. అదే సమయంలో శాంతి చర్చలు అంటూ సాగదీత కార్యక్రమం జరిగింది. సరైన సమయంలో అమెరికా- ఇజ్రాయెల్ ఒకే సారి సంయుక్తంగా విరుచుకుపడడంతో సుప్రీం లీడర్ శకం అంతమైంది. !