Reading Time: 2 minutes

ముగ్గురు సభ్యుల గార్డియన్ కౌన్సిల్

కొత్త సారధి కీలక మత పెద్ద, మదర్సా సారధి

ఖమేనీకి అత్యంత సన్నిహితుడు

సమిష్టి నిర్ణయాలతోనే పాలన

టెహరాన్ : ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం మేరకు దేశంలోని ఇస్నా వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి. ఆయనకు పాలనా పగ్గాలు అప్పగించారు. ఇంతకు ముందు ఆయన ఇస్లామిక్ బోధక విద్యాసంస్థలు, మదర్సా కార్యకలాపాల జాతీయ వ్యవస్థకు సారధి. దేశంలోని ప్రాబల్య షియా వర్గంలో ఉన్న గురుత్వంతో ఈ కీలక స్థానం దక్కింది. అంతేకాకుండా ఖమేనీ అంతర్గత కూటమిలో విశ్వాస పాత్రుడుగా పేరొందిన రెజా గార్డియన్ కౌన్సిల్‌లో మతవ్యవహారాల సభ్యుడిగా ఉన్నారు. దేశంలో పలు వ్యవహారాల నిపుణుల సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. రెజా ముందు పలు సంక్లిష్ట అంశాలు ఉన్నాయి. ముందుగా ఇరాన్‌పై తీవ్రస్థాయి అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తట్టుకోవల్సి ఉంటుంది. ఇదే దశలో ఇరానీయన్లలో పాలకుల పట్ల కనీస సంఘీభావం వ్యక్తం కావాలంటే ఖమేనీ అంతానికి ప్రతీకారం తీర్చుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ముందుండే ప్రధాన సవాలు దేశంలోని యువనవతరం ఇప్పటి రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు తాము పగ్గాలు స్వీకరించేందుకు ముందుకు వస్తే ఏం చేయాలనేది ఖరారు చేసుకోవాలి.

రాబోయే రోజులు గంటల వ్యవధిలోనే తన నాయకత్వ సమర్థతను నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో చలామణిలో ఉన్న అంతర్గత నాయకత్వ మండలి సభ్యుల రహస్య సమావేశంలో కొత్త నేతను ఎంపిక చేశారు. అయితే తాత్కాలిక బాధ్యతల్లోకి తీసుకున్నారని వెల్లడైంది. ఇరాన్‌లో ఖమేనీ హత్య వెంటనే అక్కడి రాజ్యాంగంలోని ఆర్టికల్ 111ను ఆచరణలో పెట్టారు. అత్యవసర రీతిలో నాయకత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా రెజా ఉంటున్నప్పటికీ శాశ్వత వారసుడి ఎంపిక వరకూ ముగ్గురు సభ్యుల కౌన్సిల్ బాధ్యతలను తీసుకుంటుంది. విధి విధానాలను బట్టి రెజా ఇకపై దేశ అధ్యక్షులు మసౌద్ పెజిషుకియాన్, దేశ ప్రధాన న్యాయమూర్తి గోలామ్ హుస్సేని మెహ్‌సెని ఎజితో కలిసి దేశాన్ని పాలించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు పాలనా నిర్వహణకు అంతిమ నిర్ణయాలు అన్ని కూడా ఖమేనీపైనే ఆధారపడి ఉండేవి. అయితే ఇప్పుడున్న కౌన్సిల్‌లోని ముగ్గురు సభ్యులలో రెజానే మతపెద్దగా కీలక పాత్ర పోషిస్తారు. రెజా 1959 లో జన్మించారు. దేశ రక్షణ కీలక విషయాలపై కూడా ఆయనకు అనుభవం ఉందని వార్తా సంస్థలు తెలిపాయి.