
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
వికారాబాద్‌లో భారీ బందోబస్తు
మాజీ మావోలతో రాహుల్ భేటీ?
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 2న (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. పది రోజుల పాటు వికారాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజు సోమవారం రాహుల్ హాజరై డిసిసి అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉదయం 9.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు బయలుదేరి ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ హరిత హోటల్‌లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. సాయంత్రం 4.30 వరకూ డిసిసి అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ ?
ఇదిలాఉండగా రాహుల్ పర్యటనలో మరో ఆసక్తికర అంశం మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారని తెలిసింది. ఇది ఇంకా ఖరారు కాలేదు. కానీ సమయాన్ని బట్టి కొంతసేపు సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వికారాబాద్‌లో భారీ ఏర్పాట్లు..
రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా వికారాబాద్ హరిత హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. డిసిసి అధ్యక్షులకు పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిసింది. రాహుల్ గాంధీ పర్యటనతో రెండు రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు ఆశిస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.