Reading Time: < 1 minute

జూన్ 10 తర్వాతే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు 

Caption of Image.

నైరుతి రుతుపవనాలు జోరందుకోవడం లేదు. అనుకున్న టైంకు ముందుగానే అరేబియా సముద్రంలోకి ప్రవేశించినా.. వాటికి అక్కడే బ్రేక్​ పడిపోయింది. సరైన వేగం లేక మందకొడిగా ముందుకు సాగుతున్నాయి. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారమైనా పట్టొచ్చని ఐఎండీ తాజాగా వెల్లడించింది. వాస్తవానికి నాలుగు రోజులు అటూఇటుగా ఈ నెల 26 నాటికే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. ఆ  తేదీ దాటి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయినా రుతుపవనాలు మాత్రం ముందుకు కదలడం లేదు. 

పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నా.. వాతావరణంలోని కొన్ని కారణాలు రుతుపవనాలు ముందుకు కదలనివ్వడం లేదని వెదరాఫీసర్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా, వేగంగా ముందుకు కదలాలంటే పశ్చిమం నుంచి వీచే గాలులు (వెస్టర్లీస్​) సరైన ఎత్తులో ఉండాలని అంటున్నారు. వెస్టర్లీస్​ కనీసం 4 మీటర్ల ఎత్తులో ఉంటేనే నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకెళ్తాయని, కానీ, ప్రస్తుతం అవి కేవలం 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. 

పొడి వాతావరణం ఎక్కువగా ఉండడం, వర్షాకాలానికి ముందొచ్చే వానలు (ప్రీ మాన్సూన్​ షవర్స్​) లేకపోవడం వంటి కారణాలు కూడా రుతుపవనాల మందగమనానికి కారణమవుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఎల్​నినో ఎఫెక్ట్​ ప్రారంభమవుతుండడం కూడా రుతుపవనాల రాకకు అడ్డుగా మారిందని అంచనా వేసింది. కాగా, మన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్​ 10 నాటికి ఎంటరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.