Reading Time: < 1 minute
Ipl 2026 Final Rcb Captain Rajat Patidar Blunt Response On India Team Selection

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలెక్షన్‌కు బలమైన పోటీదారుగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్, 18 ఏళ్ల ఫ్రాంచైజీ నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. ఈ సీజన్‌లోనూ జట్టును వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, బ్యాటర్‌గా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ సీజన్ 14 మ్యాచ్‌ల్లో 196.76 స్ట్రైక్ రేట్‌తో, 44.18 సగటుతో 486 పరుగులు చేశాడు. ఇందులో క్వాలిఫయర్-1 లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 33 బంతుల్లోనే సాధించిన 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కూడా ఉంది.

అయితే, ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా టీ20 జట్టులో చోటుపై ప్రశ్నించగా.. పాటిదార్ చాలా నిర్మొహమాటంగా సమాధానమిచ్చాడు. తాను ప్రస్తుతం భారత జట్టు సెలెక్షన్ గురించి అస్సలు ఆలోచించడం లేదని, తన దృష్టి అంతా ఫైనల్ పైనే ఉందని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరగబోయే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో ఆర్‌సీబీ ఆడుతున్న భయం లేని, హై-రిస్క్ క్రికెట్ కారణంగా పేపర్‌పై బెంగళూరు జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. పిచ్ ఎలా ఉన్నా, ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలు ఏవైనా సరే.. వీరంతా ఒకే గేర్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు. ఈ సీజన్‌లో మరే జట్టు కూడా ఆర్‌సీబీ తరహాలో ఇన్ని సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించలేదు. గత రెండు సీజన్లుగా రజత్ పాటిదార్ ప్రశాంతమైన కెప్టెన్సీ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. విరాట్ కోహ్లీ లేదా డుప్లెసిస్ లాగా మైదానంలో దూకుడు ప్రదర్శించకపోయినా, 32 ఏళ్ల పాటిదార్ తన ప్రశాంతతతో జట్టులోని ఇటు సూపర్‌స్టార్లను, అటు యువ ఆటగాళ్లను సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.