Reading Time: < 1 minute
Operation Sindoor 2 Army Ready Upendra Dwivedi Warning Pakistan

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో ఆయన మాట్లాడుతూ, పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. 2025లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసి, ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

ద్వివేది ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ.. భారత్ సైనిక చర్యకు ఇది ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని అన్నారు. త్రివిధ దళాల సమన్వయానికి ఇది ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. నేటి భద్రతా సవాళ్లు కేవలం యూనిఫాం రూపంలో సరిహద్దుల నుంచి రావని అన్నారు. గ్రే జోన్, హైబ్రిడ్ యుద్ధం, వేగవంతమైన ఆధునిక యుద్ధం వంటి వాటిని ఎదుర్కొనేటప్పుడు సైనికులు మరింత తీక్షణంగా ఆలోచించి వ్యవహరించాలని సూచించారు. భారతదేశం స్పందించినప్పుడు అది ఖచ్చితంగా, ప్రభావవంతంగా ఉంటుందని సిందూర్ నిరూపించిందని అన్నారు. 42 ఏళ్ల క్రితం తాను కూడా ఇక్కడి నుంచే పాస్ అవుట్ అయ్యానని చెప్పారు. ప్రస్తుతం తన కెరీర్ చివరి దశలో ఉందని, కొత్త క్యాడెట్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించారని అన్నారు.

2025 మే నెలలో, భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసింది. పాకిస్తాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తే, ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.