Reading Time: < 1 minute
US-Israel Iran War LIVE: భీకరంగా యుద్ధం.. రణరంగంగా పశ్చిమాసియా.. మోదీ కీలక చర్చలు..

ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది.  భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి. ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు.  ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.

ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ

ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్య నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ పరిస్థితులను వివరంగా చర్చించామని మోదీ తెలిపారు. “ఇటీవలి పరిణామాలపై భారత ఆందోళనలను నెతన్యాహుకు తెలియజేశాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.

మరోవైపు ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్‌ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్‌ నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ధ్వంసం చేశామన్నారు. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని.. ఇరాన్‌ నౌకాదళం మొత్తం నాశనమైందని తెలిపారు. దాడుల్లో 48 మంది ఇరాన్‌ నేతలు చనిపోయారన్నారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని తెలిపారు ట్రంప్‌. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, ఇరాన్‌తో చర్చలకు సిద్ధం అన్నారు ట్రంప్‌. చర్చల కోసం ఇరాన్‌ ముందే రావాల్సిందన్నారు ట్రంప్‌.