Reading Time: < 1 minute

రేవంత్ ఫ్యామిలీతో గడపడం

చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నెల 4న నగరంలో జరుగనున్న విజయ్ దేవరకొండ,- రష్మిక వివాహ రిసెప్షన్‌కు సిఎం కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ఆప్యాయంగా గడిపారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సిఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉందని, దీన్ని తాను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను అని రష్మిక పేర్కొన్నారు.