
వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం…
మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్ష : ఎన్‌పిఆర్‌డి
మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న హైదరాబాద్‌లో సాముహిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు మానవ హక్కుల జాతీయ వేదిక వెల్లడించింది. వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు బి స్వామి, సహాయ కార్యదర్శి జెర్కొని రాజు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా ఎన్నికల హామీలు వికలాంగుల పెన్షన్ రూ. 4016 నుండి రూ. 6వేలకు పెంచడం, చేయూత పెన్షన్స్ రూ. 2016 నుండి రూ. 4 వేలకు పెంచలేదని అన్నారు.
29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు చేశారని, చేయూత పెన్షన్స్ కోసం ప్రతి నెల రూ. 994.50 కోట్లు అవసరమని, .2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 14628.91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. 2026-27 వార్షిక బడ్జెట్‌లో పెన్షన్స్ పెంపుదలకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తోందని, 2026-27 బడ్జెట్‌లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెపుతున్న ముఖ్యమంత్రికి చేయూత పెన్షన్స్ పెంచలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్స్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.