Reading Time: < 1 minute
Pakistan T20 World Cup 2026 Exit Sparks Debate Over Captaincy Change And Mohsin Naqvi Decisions

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. శ్రీలంకపై విజయం సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌ లేకపోవడంతో పాక్ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గత నాలుగు టీ20 వరల్డ్‌ కప్‌ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్సీ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాబర్ అజమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పాక్ స్థిరమైన ప్రదర్శన చేయగా.. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో దారుణ ప్రదర్శన చేసింది. దాంతో కెప్టెన్సీ మార్పుకు కారణమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీపై పాక్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాక్ ఓటములను ఎదుర్కొంటోందని కామెంట్స్ చేస్తున్నారు.

బాబర్ అజమ్ నాయకత్వంలో పాకిస్థాన్ 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో ఓడిపోయినా.. జట్టు ప్రదర్శన బాగుంది. 2022లో అయితే ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో ఓటమి పాలైనా.. వరుసగా రెండు వరల్డ్‌ కప్‌ల్లో నాకౌట్ దశకు చేరడం బాబర్ కెప్టెన్సీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే 2024 వరల్డ్‌ కప్‌లో భారత్, అమెరికా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం బాబర్ కెరీర్‌లో మచ్చగా మిగిలింది.

Also Read: IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక 2026 టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్ కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో బరిలోకి దిగింది. లీగ్ దశలో టీమిండియాపై ఓటమిని ఎదుర్కొంది. సూపర్-8 దశకు చేరినా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పోరాటం జట్టుకు కఠిన సవాలుగా మారింది. ఫలితంగా పాక్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో పాక్ ప్రదర్శనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబర్ అజమ్ హయాంలో పాక్ వరుసగా సెమీస్, ఫైనల్ చేరిందని… అయినా ఎందుకు కెప్టెన్సీ మార్పు చేశారన్న చర్చ మొదలైంది. సల్మాన్ ఆఘాను కెప్టెన్‌గా కొనసాగించడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.