Reading Time: 2 minutes
India Vs West Indies Virtual Quarterfinal Eden Gardens Rain Net Run Rate T20 World Cup 2026

India vs West Indies: సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ జట్టు పుంజుకుంది. నిన్న జింబాబ్వే జట్టుపై భారీ స్కోర్ చేసింది. 72 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అసలు కథ ముందుంది. మార్చి 1, ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్ట్ ఇండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. గెలిచిన జట్టే సెమీస్‌కు దూసుకెళ్తుంది. జింబాబ్వేపై భారత విజయం తర్వాత గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌ టికెట్ దక్కించుకుంది. జింబాబ్వే మాత్రం ఇంటికి పయనమైంది. అందువల్ల భారత్-వెస్టిండీస్ పోరు అసలైన ‘డూ ఆర్ డై’గా మారింది.

READ MORE: Vijay:తాళి కటెప్పుడు చేతులు వణికాయి..రష్మికకు అది మూడోసారి కాబట్టి కూల్‌గా ఉంది..

అయితే అభిమానుల్లో మరో టెన్షన్ మొదలైంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే? నిబంధనల ప్రకారం మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లకూ ఒక్కో పాయింట్ చొప్పున లభిస్తుంది. అలా అయితే రెండు జట్లకూ మూడు పాయింట్లు అవుతాయి. కానీ ఇక్కడే నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. జింబాబ్వేపై వెస్టిండీస్ 101 పరుగుల భారీ విజయంతో +1.791 నెట్ రన్‌రేట్ సాధించింది. భారత్ నెట్ రన్‌రేట్ ప్రస్తుతం -0.100గా ఉంది. మ్యాచ్ రద్దయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా వెస్టిండీస్ సెమీస్ చేరుతుంది. భారత్ టోర్నమెంట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది.

READ MORE: Arshdeep Singh: వరల్డ్‌కప్‌ విజేత, అత్యధిక వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. అర్ష్‌దీప్ టీ20 కెరీర్‌లో ఇంకెన్నెన్నో!

ఇక్కడ మరోసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యూహంపై చర్చ మొదలైంది. జింబాబ్వే మ్యాచ్‌లో సూర్య బుమ్రా, పాండ్యాలను సరిగ్గా వినియోగించుకోలేదు. బదులుగా శివమ్ దూబేకు రెండు ఓవర్లు ఇచ్చారు. ఆ ఓవర్లలో 46 పరుగులు వచ్చాయి. ఇక్కడే పెద్ద దెబ్బ పడింది. ఒకవేళ భారత్ జింబాబ్వే మ్యాచ్‌లో 108 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలిచుంటే, నెట్ రన్‌రేట్ వెస్టిండీస్ కంటే మెరుగ్గా ఉండేది. అప్పుడు వర్షం పడినా నిశ్చింతగా ఉండేది. ఇక్కడ కెప్టెన్ చేసిన తప్పుకు మూల్యం తప్పదు! మరోవైపు.. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కోల్‌కతాలో ఆదివారం వాతావరణం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రత 34 డిగ్రీల వరకు ఉండగా, మ్యాచ్ సమయానికి 25-26 డిగ్రీలకు తగ్గుతుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సమయంలో వర్షం అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇప్పటికైతే వాతావరణం అభిమానులకు ఊరట ఇచ్చింది. ఇప్పుడు అందరి చూపు ఈ కీలక పోరుపైనే ఉంది.