Reading Time: < 1 minute
Virender Sehwag On Ms Dhoni He Was Born With Captains Luck

MS Dhoni Born With Captain’s Luck Said Virender Sehwag: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, సహచరుడు మహేంద్ర సింగ్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేకమైన అదృష్టం ఉందన్నాడు. మహీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే భారత జట్టు ప్రదర్శన స్థాయి పెరిగిందని పేర్కొన్నాడు. కొందరు తమ అదృష్టాన్ని తామే సృషించుకుంటారని అంటారు కానీ.. ధోనీ మాత్రం అదృష్టంతోనే జన్మించాడన్నాడు. అదే అదృష్టాన్ని తనతో పాటు జట్టుకు కూడా తీసుకొచ్చాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ అదృష్టంతోనే జన్మించాడు. ధోనీ కెరీర్ ప్రారంభం నుంచే భారత జట్టు విజయాల గ్రాఫ్ పైకి వెళ్లింది. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, విజయశాతం.. అన్నీ గణనీయంగా పెరిగాయి. కేవలం భారత జట్టుకే కాదు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకూ ఇదే అదృష్టం కలిసొచ్చింది. మహీ తన అదృష్టాన్ని తనతో పాటు ఆతడు ఆడే జట్లకు కూడా తీసుకొచ్చాడు’ అని ప్రశంసించాడు.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలో సీఎస్‌కే ఎన్నో విజయాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ధోనీ విజయాల గ్రాఫ్ చాలా ఎత్తుకు చేరిందని, అది సాధారణ స్థాయిని దాటి ప్రత్యేక స్థాయిలో నిలిచిందని వీరూ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ధోనీ అదృష్టమే అతడిని ఈ స్థాయికి చేర్చిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరూ కామెంట్స్ క్రికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2024 నుంచి ధోనీ, సెహ్వాగ్ కలిసి ఆడారు. మహీ కెప్టెన్సీలో వీరూ 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడాడు.