Reading Time: < 1 minute
Rinku Singh Father Death Khachandra Singh Passes Away After Battling Liver Cancer

Indian Cricketer Rinku Singh Father Death: భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఖచంద్ర ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి.. చికిత్స అందించారు. క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉండడంతో ఆయన శారీరం సహకరించక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ఇటీవల ఖచంద్ర సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడుతున్న రింకూ సింగ్.. విషయం తెలుసుకుని ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లాడు. వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఖచంద్ర ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు.

రింకూ సింగ్ తండ్రి మరణ వార్త తెలిసి క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకూ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడడం ఇక అనుమానమే. సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో దుమ్మురేపిన రింకూ.. టీమిండియాలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు.