Reading Time: 2 minutes
Off The Record About Narasannapeta Politics Dharmaana Vs Baggu Families Bring Next Generation Into Spotlight

Off The Record : ఏపీ పాలిటిక్స్‌లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎన్నికల టైంలో తప్ప మిగతా ఎప్పుడూ అడిషనల్‌ నాయిస్‌ ఉండదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. పొలిటికల్‌ యాక్టివిటీ మాత్రం కామ్‌గా జరిగిపోతుంటుంది. ఇక్కడ దశాబ్దాల నుంచి ధర్మాన వర్సెస్ బగ్గు ఫ్యామిగా రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, ప్రసాదరావు వైసీపీ తరపున, బగ్గు లక్ష్మణరావు, బగ్గు రమణమూర్తి టిడిపి నుంచి వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే… రాజకీయాలలో తలపండిన ఈ నేతలు ఇక రిటైర్‌ అవ్వాలనుకుంటున్నారట. అందుకే మెల్లిగా తమ వారసుల్ని తెర మీదికి తీసుకువచ్చి పొలిటికల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం పోలాకి జెట్పీటీసీగా ఉన్నారు. తన రాజకీయ వారసుడిని ఆశీర్వదించమంటూ ఇప్పటికే పలు వైసీపీ మీటింగ్స్‌లో విజ్ఞప్తి చేశారు కృష్ణదాస్‌. ఈ లెక్కన 2029 ఎన్నికల నాటికి కృష్ణ చైతన్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఇక తాజాగా..సిట్టింగ్‌ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన కూడా నియెజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా పొలిటికల్‌ యాక్టివిటీ పెంచడం, ఇద్దరు యువ నేతలు ఎక్కువగా వివిధ కార్యక్రమాలకు హాజరవడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఒక్కసారిగా యంగ్‌ యాక్టివిటీ పెరిగిపోవడంతో… నరసన్నపేట టీడీపీ, వైసీపీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ పెద్దోళ్ళ సైలెంట్ పాలిటిక్స్‌కు ఇక కాలం చెల్లింది, మన దగ్గర కూడా రీ సౌండ్‌ వస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇద్దరు నాయకులు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌ని ఉత్తేజ పరిచేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. గత సాధారణ ఎన్నికలలోనే ధర్మాన కృష్ణ దాస్ తనకు కాకుండా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని అధినేత జగన్‌ను కోరారుగానీ కుదరలేదు. కానీ ఇప్పుడు మాత్రం అధిష్టానం దృష్టిలో ఉంచారో లేదో గానీ…వరుస సమావేశాలలో కృష్ణ చైతన్యకు అండగా ఉండాలని ద్వితీయ శ్రేణి నేతలకు చెబుతున్నారట. కృష్ణ చైతన్య దూకుడుగా పార్టీ కార్యక్రమాలకు ఎటెండ్ అవుతుంటే , దాస్ కాస్త విరామం తీసుకుంటున్నారన్నది లోకల్ టాక్ . మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కూడా కృష్ణ చైతన్యను ఢీ కొట్టేలా తన వారసురాలిని బరిలో దింపేందు ప్లాట్ పాం సిద్దం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ రాజకీయాల జోలికి రాని బగ్గు అర్చన ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడమేగాక ఎగ్రెసివ్‌గా పొలిటికల్‌ ప్లానింగ్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంటా బయటా అంతా తానై వ్యవహరిస్తూ… తండ్రితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ఇలా వారసుల రాకతో నరసన్నపేట రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. రాజకీయాలకు యువ రక్తం తోడైతే జోష్‌ పక్కా..అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల టైంకి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.