Reading Time: < 1 minute
Shocking Incident In Mumbai Fruit Vendors Arrested For Applying Rat Poison On Fruits In Malad

Rat Poison on Fruits: ఆరోగ్యం కోసం వివిధ రకాల పండ్లు తీసుకుంటారు.. ఒకవేళ అనారోగ్యంపాలైనా.. కోలుకోవడానికి కూడా ఫ్రూట్స్‌ తీసుకుంటారు.. అయితే, ఆరోగ్యం, అనారోగ్యం నుంచి కోలుకోవడం సంగతి అటు ఉంచితి.. ఇంకా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తప్పదని కొన్ని ఘటనలు హెచ్చరిస్తున్నాయి.. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని ఉత్తర శివారు ప్రాంతం మలాద్‌లో పండ్ల విక్రయానికి సంబంధించిన ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పండ్లపై ఎలుకల మందు పూసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి, వారి దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Read Also: Komali Suicide Case: యూట్యూబర్ కోమలి కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ ఫ్రెండ్ సంచలన స్టేట్‌మెంట్..

స్థానిక నివాసి కునాల్ సలుంకే లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఎలుకల నుండి పండ్లను రక్షించాలనే నెపంతో విక్రేతలు పండ్లపై విషపూరిత పదార్థాన్ని పూస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో రూపంలో రికార్డు చేసి పోలీసులకు సాక్ష్యంగా సమర్పించినట్లు సమాచారం. ఇక, ఫిర్యాదు అందుకున్న వెంటనే మలాడ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఎలుకల నుంచి రక్షణ కోసం పండ్లపై ఎలుకల మందు ఉపయోగించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆహార పదార్థాలపై విషపదార్థాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు.

అరెస్టు చేసిన నిందితులను మనోజ్ కుమార్ కేసర్వానీ మరియు బిపిన్ కేసర్వానీగా గుర్తించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్లు 125, 274, 275, 286 కింద కేసులు నమోదు చేశారు. దుకాణాన్ని సీజ్ చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని అధికారులు హెచ్చరించారు. ప్రజలు పండ్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.