Reading Time: < 1 minute

అమరావతి: ఉగ్రవాద సంస్థలకు వైసిపికి తేడా లేదని ప్రజల అభిప్రాయం అని ఎపి మంత్రి పార్థసారధి తెలిపారు. తల్లి, చెల్లి కూడా మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన స్వలాభం కోసం దేనికైనా తెగిస్తారని.. వైఎస్ కుటుంబ గౌరవాన్ని రోడ్డుపైకి ఈడ్చారని విమర్శించారు. ఉగ్రవాద భావజాలం వ్యాపింపచేసి ఎపిని నాశనం చేయాలని వైసిపి చూస్తోందని, ప్రతిపక్షాలపై దాడులు చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. జగన్ చెబితే ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని..ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, వైసిపి రాజకీయ పార్టీనా? లేక ఉగ్రవాద సంస్థనా? అని పార్థసారథి ప్రశ్నించారు. ఎపిలో గత ఐదేళ్లలో అరాచక పాలన సాగిందని,  వైసిపి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను వైసిపి నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అధికార మదంతో వైసిపి నేతలు సామాన్యులను వేధించారని, అభివృద్ధికంటే విధ్వంసానికే వైసిపి ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని పార్థసారధి హెచ్చరించారు.