
అమరావతి: టిటిడి చైర్మన్ గా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచే రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు తెలిపారు. టిటిడి ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎఐ వీడియోలు చేసి వైసిపికి చెందిన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, డీప్ ఫేక్ వీడియోలపై చట్టపరంగా ముందుకెళ్తానని అన్నారు. డీప్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులలకు ఫిర్యాదు చేశానని, దుష్ప్రచారం చేస్తున్న దుష్టశక్తులను వదిలేది లేదని బిఆర్. నాయుడు హెచ్చరించారు. టిటిడి చైర్మన్ పదవికి మీరు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. సిఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారని.. ఆయన అడిగితే వెంటనే రాజీనామా చేస్తానని తెలియజేశారు. మార్ఫింగ్ వీడియోలతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్. నాయుడు విమర్శించారు.
బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. వైసిపి హయాంలో ఎన్నో స్కామ్ లు జరిగాయని, వారి బండారం బయటకు వస్తుందనే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైసిపి మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏమేం చేశారో తనకు తెలుసు.. బయటపెట్టమంటారా? అని నిలదీశారు. సిఎం సంయమనం పాటించమన్నారు.. అందుకే వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి గజదొంగ అని ప్రపంచమంతా తెలుసు అని.. తన వల్ల టిటిడికి చిన్న మచ్చ వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఛీప్ పాలిటిక్స్ మానుకోవాలని, తన దగ్గర మీడియా ఉంది.. తోలు తీస్తానని హెచ్చరించారు. టిటిడి నిధులను హిందూధర్మం ఛానల్ కు మళ్లీస్తున్నారనడం అవాస్తవం అని..ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టనని, వాళ్లు చేసిన తప్పులను వెతుకుతున్నందుకే ఇలా చేస్తున్నారని బిఆర్. నాయుడు ధ్వజమెత్తారు.