Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఒక్క ఇళ్లు కూల్చకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. హైదర్ షా కోట్, కేకే నగర్ వాసులతో కెటిఆర్ పాదయాత్ర చేశారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అంటూ మూసీ బాధితులు ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా..క్షేత్ర స్థాయిలో బిఆర్ఎస్ పోరుబాట సాగింది. రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కెటిఆర్ మాట్లాడారు. మూసీ తీరప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు, కన్నీటి గాథలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా బాధితులకు అండగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు.

కేవలం ఇండ్లు పోతున్న వాళ్లు మాత్రమే కాకుండా.. పేదల పొట్ట కొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మూసీ బాధితుల పక్షాన 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతామని తెలియజేశారు. ఈ రోజు వాళ్ల ఇల్లు-ఆ తర్వాత మిగిలిన వారి ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేస్తుందని పేర్కొన్నారు. ఇవాళ పక్కనున్నవాళ్ల ఇళ్లు పోతే మాకేంటన్న ధోరణి వీడాలని సూచించారు. రేపు మీ ఇళ్లను కూల్చేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని, పేదల ఇళ్లను కూల్చడం తగదు.. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని కోరారు. ప్రతి ఇంటికి అండగా తాముంటాం అని కెటిఆర్ భరోసా ఇచ్చారు.