
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 21 మంది మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాణాసంచా పేలుడు ధాటికి పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్ పరిశ్రమలో శనివారం సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అడబాల వీరబాబు అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి ఈ బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరిపొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం ఏర్పాటు చేశాడు. తయారీ కేంద్రంలో రోజూ 34 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించిందని,
దాదాపు గంటకుపైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి బాణసంచా తయారుచేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్ధం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శబ్ధతీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పక్క గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల దాటికి ఐదు గ్రామాల పరిధిలో దట్టమయిన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునే సరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించగా, కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనలో 21 మంది చనిపోయినట్లు అధికారుల నిర్దారించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన పలువురు మంత్రులు చేరుకొని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి అధికారులకు అవసరమయి ఆదేశాలు జారీ చేశారు.
ఘటనా స్థలం వద్ద భీతావహంగా పరిస్థితి..
పేలుళ్ల ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొలాల మధ్య బాణసంచా తయారీ కేంద్రం ఉండటం అక్కడికి ఫైర్ ఇంజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో చాలాసేపటి వరకు పేలుళ్లు కొనసాగాయి. ఘటనా స్థలం వద్ద పరిస్థితి బీతావహంగా ఉంది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడి బాధితులను అతికష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు.