Reading Time: 3 minutes

దుబాయ్ /వాషింగ్టన్/టెహ్రాన్/ జెరూసలెం : పశ్చిమాసియాలో తీవ్ర పరిణామాలతో భూగోళం ఉడుకెత్తే ముప్పు తలెత్తింది. శక్తివంత దేశాల గ్రహాలు కూటములుగా వీడి తలపడే స్థితి వచ్చింది. శనివారం తెల్లవారుజామునే అమెరికా, ఇజ్రాయెల్ సేనలు వేర్వేరుగా, కలిసికట్టుగా తాము ఎంచుకున్న ఇరాన్‌పై భీకర దాడులకు దిగాయి. ఇరాన్‌పై తమ దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ తమ సైనిక చర్యకు ఆపరేషన్ రోరింగ్ లయన్‌గా పేరు పెట్టినట్లు ప్రధాని నెతాన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా జంట సైనిక దాడులతో శనివారం ఇరాన్ రాజధాని టెహరాన్ దద్దరిల్లింది. డౌన్‌టౌన్ అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, సుప్రీం నేత ఖమేనీ అధికారిక కార్యాలయాల వద్ద భీకర దాడులు జరిగాయి. తాము ఇరాన్‌పై తప్పనిసరిగా దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలలో తక్షణ రక్షణ చర్యలకు దిగారు అనేక చోట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇరాన్ రాజధానిలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. అయితే ఎంత మంది బాధితులు అనేది అధికారులు తెలియచేయలేదు. ఇరాన్ గగనతలం పూర్తిగా మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

చాలా రోజులుగా ఇక ఇరాన్‌పై దాడులు సాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెపుతున్న దశలోనే యుద్ధ విమానాల వీర విహారంతో బాంబుల వర్షాల మోతలు మోగాయి. తొట్టతొలి దాడి ఇరుపక్షాల నుంచి ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ అధికారిక కార్యాలయాల వద్ద జరిగింది. వెనువెంటనే ఇరాన్‌లోని పలు ప్రాంతాలలో రెండు దేశాల సేనలు విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్త దాడులు సాగుతున్నాయని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. రాజధాని టెహ్రాన్‌లో విద్వంస సూచికగా పలు చోట్ల పెద్ద ఎత్తున మంటలు పొగలు అలుముకున్నాయి. తమ దేశంపై దాడులకు వెంటనే ఇరాన్ సైనిక బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా ముందస్తు కార్యాచరణతో స్పందించాయి. పలు అమెరికా మిత్రపక్ష దేశాలు, ఇజ్రాయెల్ అనుకూల దేశాల సైనిక స్థావరాలపై మెరుపుదాడులకు దిగాయి. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, బహరైన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని దాడులకు దిగారు. ఇరాన్ చర్యను వెంటనే సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది.

ఇరాన్‌పై భారీ దాడి స్టార్ట్ : ట్రంప్ ప్రకటన

ఇంతకాలం ఓపిక పట్టాను. ఇక ఆగేది లేదని, ఇప్పుడు ఇరాన్‌పై తాము భారీ స్థాయి పోరు చర్యకు దిగామని వైట్‌హౌస్ నుంచి అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అమెరికాను నేరుగా తాకే రీతిలో ఉండే అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్‌ను రూపొందించుకుంది. పైగా ఎంత చెప్పినా వినకుండా తన అణు కార్యక్రమాలతో సాగుతోందని, దీనిని గుర్తించే తమ ఆపరేషన్‌ఇరాన్ ఆరంభం అయిందని ట్రంప్ తమ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ తాము ఇరానీయన్లు తమ విధిని భవితను ఖరారు చేసుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ముందుగా మీరు ఇస్లామిక్ నాయకత్వపు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కదలండి, పాలనను చేతుల్లోకి తీసుకుంటే మీరు రక్షింపబడుతారని హెచ్చరించారు. 1979 నుంచి సాగుతున్న పాలనను ముగించాలని హితవు పలికారు. ఆయన ప్రకటనల దశలోనే ఖమేనీ ఆఫీసులపై ఇజ్రాయెల్ దాడులు , అమెరికా సేనల తోడ్పాటుతో భీకర రీతిలో సాగాయి. తాము సైనిక చర్య ముగించేలోగానే మీరు పాలనను చేతుల్లోకి తీసుకోవాలని ట్రంప్ ఈ దశలో ఖమేనీకి వ్యతిరేకంగా ఇరానీయన్లను రెచ్చగొట్టేందుకు పావులు కదిపాడు. మీ రాబోయే తరాలను నిలబెట్టుకోవడానికి మీ ముందున్న ఏకైక మార్గం ఇదే అని సూచించారు. ఆయన సందేశం వీడియో రూపంలో వెలువడింది. మరో వైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహూ కూడా జెరూసలెం నుంచి ఇదే రీతిలో ప్రకటన వెలువరించారు. తమ సంయుక్త ఆపరేషన్ క్రమంలో ఇక ఇరాన్ పౌరులు పాలనా పగ్గాలు చేపట్టే పరిస్థితి వస్తుందని తెలిపారు.

పలుదేశాల్లో యుఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వెంటనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ముందుగా ఇజ్రాయెల్‌లోని పలు స్థావరాలను ఎంచుకుని ఇరాన్ యుద్ధ విమానాలతో , డ్రోన్లతో విరుచుకుపడింది. వెనువెంటనే అమెరికా మిత్రదేశాలను ఎంచుకుని అక్కడి అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులకు దిగారు. అరబ్ ఏమిరేట్స్, బహరైన్, ఖతార్, జోర్డాన్ , రియాద్ ల్లోని ప్రధాన స్థావరాలపై దాడులకు దిగారు. ఇరాన్ దాడులతో యుఎఇ రాజధాని అబూధాబిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. యుఎఇ, ఇరాక్‌లు తమ గగనతలాలను మూసివేశాయి. తమ దేశంలోని అమెరికా నౌకాదళ 5వ దళం ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయని బహరైన్ తెలిపింది. కువైత్‌లోని ఖతార్‌లో నెలకొని ఉన్న యుఎస్ ఆర్మీ సెంట్రల్ కార్యాలయంపై దాడులు జరిగాయి. దీనితో భీకర ఖతార్‌లో పేలుళ్ల చప్పుళ్లు మోగాయి. ఇజ్రాయెల్, ఖతార్ ఇతర దేశాలలో సైరన్లు మోగాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీలు కూడా రంగంలోకిదిగారు. ఎర్ర సముద్రంపై నౌకలపై దాడులకు దిగుతామని, సముద్ర మార్గాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ నౌకలను లక్షంగా చేసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో గగనతల మార్గాలను మూసివేశారు. దీనితో అంతర్జాతీయ స్థాయిలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది.

ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవల్సిందేః సౌదీ

పలు దేశాలపై ఇరాన్ దాడులు ఆయా దేశాల సర్వసత్తాకత, అంతర్జాతీయ కట్టుబాట్లను దెబ్బతీయడమే అవుతోందని సౌదీ అరేబియా తీవ్రంగా మండిపడింది. ఇరాన్ చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి. ఇరాన్ దాడులను తిప్పికొట్టాల్సి ఉంది. ఈ ప్రాంత సుస్థిరతను దెబ్బతీస్తూ , భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇరాన్ దాడులు సాగుతున్నాయని, దీనిని సహించేది లేదని సౌదీ అరేబియా ప్రకటించింది. తమ దేశంపై ఇరాన్ దాడులను ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది.