Reading Time: 3 minutes

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పేరుతో’ 99 రోజుల కార్యాచరణ ఉం టుందని, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో త యారు చేయించాలని, మార్చి 6వ తేదీ నుంచి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళిక జరుగబోతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. మార్చి 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పనితీరు గురించి మాట్లాడుతానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లి యరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్‌లో పనిచేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని సిఎం తెలిపారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ

ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని సిఎం ఆదేశించారు. కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని అన్నారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు.

సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని చెప్పారు. ప్రతి విబాగం ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ను అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్ లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులోనూ సాంకేతికత ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రారంభం

రాష్ట్రంలోని వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ సమ్మిట్ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయని, కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని ఆయన తెలిపారు. ప్రణాళికా బద్ధంగా జీహెచ్ ఎంసిని మూడు కార్పొరేషన్‌లుగా విభజించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపైన అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

శాఖలపై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన

పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని, దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. సేవా రంగంలో వస్తున్న పెను మార్పులను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలో వాటిని చేర్చాలని సిఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపైన ప్రతి శాఖ దృష్టి పెట్టాలని, అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆయన సూచించారు. సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ విధానంలో అన్ని పనులు జరిగేలా చూడాలని, ఈ ఫైల్ విధానం ఉండాలని, నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందేనని ఆయన తెలిపారు. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు.

జూన్ 2వతేదీ తెలంగాణకు పండుగ

పాత కాలం సర్వర్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పైన దృష్టి పెట్టాలని, ఫ్యూచర్ సిటీ దేశ ఆర్ధిక స్థితినిని మార్చబోతోందని ఆయన తెలిపారు. మూసీనది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ వచ్చే మార్పులను ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి దృష్టి సారించాలని ఆయన తెలిపారు. వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించుకోబోతున్నామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, ప్రాంతాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ప్రతి సెక్రటరీ తమ శాఖల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలన్నారు. మార్చి 6వ తేదీ నుంచి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళిక జరుగబోతుందని సిఎం రేవంత్ తెలిపారు. జూన్ 2వ తేదీ వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రం కావాల్సిందేనని ఆయన సూచించారు. జూన్ 2 తెలంగాణకు పండుగ అని, ఆ పండుగ ను అంతా ఘనంగా జరుపుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి అధికారి పాల్గొనాలన్నారు. దీనికి మినహాయింపులు ఉండవని, శాఖ ల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తనకు కావాల్సిన బలాన్ని ఇచ్చారని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రజలకు మంచి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.