Reading Time: 3 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం(ఏప్రిల్ 15) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఇ.పురుషోత్తం, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ ప్రవేశాలకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మొదటి విడత దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి వెబ్ ఆప్షన్ల  నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మే 14న తొలి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈసారి డిగ్రీలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కొత్త కోర్సుల ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30 నాటికి దోస్త్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, విద్యార్థులు కొత్త కోర్సులకు కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మూడు విడతల్లో దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ400 రిజిస్ట్రేషన్ ఫీజుతో మే 15 నుంచి రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే మే 31 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూన్ 29, 30 తేదీలలో డిగ్రీ ఓరియెంటేషన్ తరగతులు ఉంటాయని, జులై 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.

రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 969 డిగ్రీ కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ కాగా, 54 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయనని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సమయంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చేదని అన్నారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా ట్యాబ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ మధ్యలో అంతరాయం ఏర్పడినా ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదీ దోస్త్ షెడ్యూల్

ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

-ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

మే 14వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

మే 15 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

మే 15 నుంచి 25 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

మే 15 నుంచి 26 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

మే 30వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

మే 31 నుంచి జూన్ 5 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

మే 31 నుంచి జూన్ 16 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

మే 31 నుంచి జూన్ 26 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

జూన్ 16వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు

జూన్ 20 నుంచి 25 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

జూన్ 20 నుంచి 27 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి

-జూన్ 29,30 తేదీలలో విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది.

జులై 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం

వాట్సాప్‌లో దోస్త్ సేవలు

దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 ద్వారా వాట్సాప్ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు ‘Hi’ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుంది. అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్‌కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/dost.telangana

దోస్త్ యూట్యూబ్ చానల్ : http://youtube.com/c/dost.telangana

దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana

దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200

హెల్ప్ లైన్ నెంబర్ : 040 23120416

……………………………………………………………………………….