Reading Time: < 1 minute

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు సోమవారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత రూపి అలియాస్ రంగబోయిన భాగ్య ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన రూపి, 2025 ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి . ఎన్‌కౌంటర్ తరువాత సంఘటన స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ తుపాకీతోపాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. కాల్పుల తరువాత మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్‌పల్లి అడవుల్లో గాలింపు ముమ్మరం చేశారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందిస్తూ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని హెచ్చరించారు. హతమైన రూపి స్వస్థలం తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంగా గుర్తించారు. ఆమె వయసు 46 సంవత్సరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. ఆ తరువాత అబూజ్‌మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తాజా సంఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇంతవరకు 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు.