Reading Time: 2 minutes
Rinku Singh Returns To Team India Squad Ahead Of Crucial T20 World Cup Super 8 Match Vs Zimbabwe

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో ఉన్న టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. వ్యక్తిగత కారణాలతో స్వల్ప విరామం తీసుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తిరిగి జట్టుతో చేరనున్నారు. గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు అతను జట్టులోకి రావడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అయితే, రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా రింకూ.. మంగళవారం జట్టును వీడి ఇంటికి వెళ్లారు. దీనితో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతని తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటంతో, రింకూ తిరిగి జాతీయ విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు.

భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ (Sitanshu Kotak) బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రింకూ సింగ్‌ తిరిగి జట్టులో చేరడాన్ని ధృవీకరించారు. “రింకూ సింగ్ బుధవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం కల్లా తిరిగి జట్టులో చేరుతాడు. అతని తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. అతను తిరిగి రావడంతో జట్టులో తుది ఎంపికకు మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి,” అని కోటక్ పేర్కొన్నారు.

వరల్డ్ కప్‌లో రింకూ ప్రదర్శన
ప్రస్తుత ప్రపంచకప్‌లో రింకూ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, డెత్ ఓవర్లలో అతని హిట్టింగ్ సామర్థ్యంపై యాజమాన్యం పూర్తి నమ్మకంతో ఉంది. ఈ టోర్నీలో USA: 6 పరుగులు, నమీబియా: 1 పరుగు, పాకిస్తాన్: 11 పరుగులు, నెదర్లాండ్స్: 6 పరుగులు చేసిన రింకూ సింగ్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు..

జింబాబ్వేపై తిరుగులేని రికార్డు
గతంలో జింబాబ్వేపై రింకూ సింగ్‌ ఆడిన రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన 48 నాటౌట్ ఇన్నింగ్స్ జట్టును ఆదుకుంది. రేపటి మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగనుండటంతో, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల రింకూ ఉనికి జట్టుకు కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీఫైనల్ రేసులో తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో రింకూ ‘మిడాస్ టచ్’ తిరిగి కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.