Reading Time: < 1 minute
Vaibhav Sooryavanshi Ipl Auction Rajasthan Royals Revelation

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 1.1 కోట్లకు తనను దక్కించుకున్నప్పుడు తాను ఎందుకు నిరాశకు గురయ్యాడో తాజాగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది.

అయితే, అంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోయినప్పటికీ, వైభవ్ మాత్రం సంతృప్తి చెందలేదు. కేవలం రెండు జట్లు మాత్రమే తన కోసం ఎందుకు పోటీ పడ్డాయనే ప్రశ్న అతడిని వేధించింది. రాజస్థాన్ రాయల్స్ షేర్ చేసిన ఒక వీడియోలో వైభవ్ మాట్లాడుతూ… “నిజం చెప్పాలంటే, నన్ను వేలంలో తీసుకున్నప్పుడు ‘నా కోసం రెండు జట్లు మాత్రమే ఎందుకు వేలం పాడాయి? నేను బాగానే ఆడతాను కదా, ట్రయల్స్‌లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాను, మిగతా జట్లు కూడా నా కోసం పోటీ పడాల్సింది’ అని అనుకున్నాను” అంటూ తన అప్పటి మానసిక స్థితిని పంచుకున్నాడు.

కానీ.. కాలక్రమేణా రాజస్థాన్ రాయల్స్ జట్టు సంస్కృతికి వైభవ్ అలవాటు పడ్డాడు. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్.. తాను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రావడం పట్ల దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. “గత ఏడాదిన్నరగా ఈ జట్టుతో ఉన్నాను. నన్ను రాజస్థాన్ రాయల్స్ లాంటి గొప్ప జట్టులోకి తీసుకొచ్చినందుకు దేవుడికి కనీసం వెయ్యి సార్లయినా కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటాను” అని అన్నాడు. ఇక్కడి కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ అందరూ ఒక కుటుంబంలా ఉంటారని, ఎంతో సొంత ఇల్లులాంటి వాతావరణం లభిస్తుందని తెలిపాడు. సీనియర్లు అంతా తనకు మంచి మార్గదర్శకత్వం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

2025లో 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్.. తన మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఇక 2026 ఐపీఎల్ సీజన్‌లో మరింత చెలరేగిపోయి, 16 మ్యాచ్‌ల్లో 237 స్ట్రైక్-రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’తో పాటు, ‘మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డును కూడా కైవసం చేసుకుని లీగ్‌ను శాసించాడు.