Reading Time: < 1 minute
LPG: గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూన్‌ నుంచి కొత్త రూల్స్‌! వారికి షాక్‌

దేశంలో పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. వంటగ్యాస్‌ వినియోగంలో ఎల్‌పీజీపై ఆధారపడుతున్న కుటుంబాలను క్రమంగా పీఎన్‌జీ వైపు మళ్లించేందుకు కొత్త నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్‌ నెల నుంచి గ్యాస్‌ వినియోగదారులపై ప్రభావం చూపే పలు మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జాతీయ పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమం కింద లక్షలాది కొత్త కనెక్షన్లు మంజూరైనప్పటికీ, వాస్తవ వినియోగం మాత్రం ఆశించిన స్థాయికి చేరలేదు. మరోవైపు దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో భారీగా పెరిగి 33.5 కోట్లకు చేరుకోగా, పీఎన్‌జీ వినియోగదారులు ఇంకా పరిమితంగానే ఉన్నారు.

కొత్త ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్‌ ఉన్న గృహాలు ఒకేసారి ఎల్‌పీజీ కనెక్షన్‌ను కొనసాగించడంపై ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకే చిరునామాలో రెండు గ్యాస్‌ కనెక్షన్లను కలిగి ఉండటాన్ని నియంత్రించేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు డేటాను సమన్వయం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పీఎన్‌జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌లపై పరిమితులు విధించే అవకాశముందని తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రీఫిల్‌ లాక్‌-ఇన్‌ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

అలాగే సంవత్సరానికి 12 సబ్సిడీ సిలిండర్ల పరిమితి కొనసాగనుండగా, అదనపు సిలిండర్లకు మార్కెట్‌ ధర వర్తించనుంది. కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌ తీసుకునే వారు రెగ్యులేటర్‌, హోస్‌, ఇన్‌స్టాలేషన్‌ వంటి ఖర్చులతో కూడిన సవరించిన డిపాజిట్‌ చెల్లించాల్సి రావచ్చు. పీఎన్‌జీ వినియోగం పెరగడం వల్ల సురక్షితమైన, నిరంతర గ్యాస్‌ సరఫరా సాధ్యమవుతుంది. అయితే వినియోగదారులకు తగిన అవగాహన, మౌలిక వసతుల విస్తరణ లేకుండా ఈ మార్పు పూర్తిస్థాయిలో విజయవంతం కావడం సవాలుగా మారవచ్చని వారు చెబుతున్నారు. జూన్‌ 30 వరకు కొనసాగనున్న PNG డ్రైవ్‌ 2.0 ఈ మార్పులకు కీలకంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి