Reading Time: < 1 minute
Tmc Panchayat Member Agrees To Return Cut Money Cooch Behar West Bengal

West Bengal:పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 15 ఏళ్లుగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు, నేతలు ప్రజలపై అనేక దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఘోర పరాజయం తర్వాత, బీజేపీకి అధికారంలోకి రావడంతో ప్రజలు టీఎంసీపై తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో తమను పీడించిన తృణమూల్ నేతలు, కార్యకర్తల బట్టలూడదీసి కొడుతున్నారు. ముఖ్యంగా ‘‘కట్‌మనీ’’ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కట్‌మనీ వ్యవహారంపై సీఎం సువేందు అధికారి కూడా ప్రత్యేక దృష్టి సారించి, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఆగ్రహం కారణంగానే తృణమూల్ నేతలు భయపడుతున్నారు. ఇప్పుడు గతంలో తాము కట్ మనీ పేరుతో దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామని టీఎంసీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నారు. కూచ్ బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఘుఘుమారి పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యులు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద అక్రమంగా వసూలు చేసిన మొత్తం ‘కట్ మనీ’ లేదా కమీషన్‌ను జూన్ 4వ తేదీలోగా తిరిగి చెల్లిస్తానని ఆటో రిక్షాలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ పెట్టి మరీ చెబుతున్నారు.

గ్రామస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్న సమయంలో పరిస్థితి బాగా లేదని టీఎంసీ నేతలు దోచుకున్న డబ్బును ఇచ్చేందుకు లిఖిత పూర్వక హామీలు ఇస్తున్నారు. ఘుఘుమారి గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 173కు చెందిన స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యురాలు జ్యోత్స్న బర్మన్ ఇంటి బయట పెద్ద సంఖ్యలో స్థానికులు నిరసన తెలిపారు. గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను కల్పించినందుకు టీఎంసీ నేతలు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు.