
పామాయిల్ గెల టన్ను ధర రూ. 21,546- రూపాయాలకు చేరుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పామాయిల్ ధర పెరగడంతో 15,024 మంది రైతులకు రెండు కోట్ల మేర అదనపు లబ్ది చేకూరనుందని మంత్రి వెల్లడించారు. రైతులకు అధిక ధరలు అందించి ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని-, ఆయిల్ ఫెడ్ ఫాక్టరీలలో ఆధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ 20.01శాతానికి పెంచామని- మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున్న చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలియజేసారు. గతంలో టన్ను ధర రూ. 12,534- ఉందని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల టన్ను ధర రూ21,546-కు పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో 1992, -93 నుంచి ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాలను (79,113 రైతులు) ఆయిల్ పామ్ సాగుచేస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 1,07,400 ఎకరాలలో 33,500 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టరని 2025, -26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు కోసం రూ. 456 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. వచ్చే సంవత్సరంలో మరో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 68,600 ఎకరాల నుండి ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు నాలుగు సంవత్సరాలకు ఏకరాకు రూ 50, 918- రాయితిని ఇస్తున్నామని, దీర్ఘకాలిక లాభాల కోసం రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి తుమ్మల కోరారు.