
సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్లున్న కార్గో విమానం రన్‌వేపై జారి, హైవే పైకి దూసుకెళ్లిన సంఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. లా పాజ్ సమీపంలో ఎల్‌ఆల్టో నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. బొలీవియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెర్కులెస్ విమానం శాంటా క్రూజ్ నుంచి బయలుదేరిన తరువాత ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ సమయంలలో రన్‌వే నుంచి పక్కకు జారి పోయింది. రద్దీగా ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లి అనేక వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఫైర్ చీఫ్ పావెల్ టోవర్ మృతులు విమానం లోని వారా లేక రన్‌వేపై ఉన్న కార్ల లోని వారా అన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను అక్కడి ప్రజలు తీసుకోవడానికి పోటీ పడుతుండగా, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.